విండీస్‌‌‌‌పై వరుసగా 9 విజయాల తర్వాత ఓడిన ఇండియా.. రెండో టీ20లో కరీబియన్ల గెలుపు

నవీ ముంబై: బ్యాటింగ్‌‌‌‌లో స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన (62), రిచా ఘోష్‌‌‌‌ (37) మినహా  మిగతా వారు నిరాశపర్చడంతో.. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 9 వికెట్ల  తేడాతో వెస్టిండీస్‌‌‌‌ చేతిలో ఓడింది. దీంతో  మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ ప్రస్తుతం 1–1తో సమంగా ఉంది. ఈ ఫార్మాట్‌‌లో 2019 నవంబర్ నుంచి కరీబియన్‌‌‌‌ జట్టుపై వరుసగా తొమ్మిది విజయాల తర్వాత ఇండియాకు ఎదురైన తొలి ఓటమి ఇది.

టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 159/9 స్కోరు చేసింది.  విండీస్‌‌‌‌ బౌలర్లు హీలీ మాథ్యూస్‌‌‌‌ (2/36), డియోంద్ర డాటిన్‌‌‌‌ (2/14), చినెల్లీ హెన్రీ (2/37), ఫ్లెచర్‌‌‌‌ (2/28) సమయోచిత బౌలింగ్‌‌‌‌తో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ను కట్టడి చేశారు. మధ్యలో జెమీమా (13), దీప్తి శర్మ (17) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌‌‌ కాలేదు. మంధాన, దీప్తి నాలుగో వికెట్‌‌‌‌కు 56, చివర్లో రిచా ఘోష్‌‌‌‌, రాధా యాదవ్‌‌‌‌ (7) ఏడో వికెట్‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌ జోడించారు.

ఇన్నింగ్స్‌‌‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. తర్వాత విండీస్‌‌‌‌ 15.4 ఓవర్లలో 160/1 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్లు హీలీ మాథ్యూస్‌‌‌‌ (85 నాటౌట్‌‌‌‌), క్వియానా జోసెఫ్‌‌‌‌ (38) తొలి వికెట్‌‌‌‌కు 66 రన్స్‌‌‌‌ జత చేసి శుభారంభాన్నిచ్చారు. తర్వాత క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌ (29 నాటౌట్‌‌‌‌) మెరుగ్గా ఆడి హీలీతో కలిసి ఈజీగా విజయాన్ని అందించింది. హీలీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. గురువారం మూడో, చివరి  టీ20 జరుగుతుంది.