కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కంచుకోట భవానీపూర్ నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ ఘన విజయం సాధించినా నందిగ్రాంలో పోటీ చేసిన మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. ఒకనాటి తన కుడిభుజం, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో ఆమె అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మమతా ఆరు నెలల్లో శాసనసభ సభ్యురాలు కాదు. దీంతో ఆమె ఏదైనా ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఆరు నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలి. దీంతో ఆ దిశగా అడుగులు వేస్తున్న ఆమెకు పార్టీ వర్గాలు అనేక సూచనలు చేసినా తన పాత స్థానం, పార్టీకి పెట్టనికోట భవానీపూర్ వైపే అడుగులు పడుతున్నాయి. ఉప ఎన్నిక కోసం ప్రస్తుతం గెలుపొందిన టీఎంసీ ఎమ్మెల్యే సొవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా పార్టీ సైతం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఉప ఎన్నిక అనివార్యం కాబట్టి భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేయడానికి అంతా లైన్ క్లియర్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
