అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

గద్వాల, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంపై ఆఫీసర్లు దృష్టి పెట్టాలని గద్వాల కలెక్టర్  సంతోష్  సూచించారు. శనివారం కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో ఆరు గ్యారంటీల అమలుపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తులు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయనే అంశాలతో పాటు ఎంతమందికి లబ్ధి జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. 

మహాలక్ష్మి స్కీమ్​లో భాగంగా రూ.500 సిలిండర్లు ఎంతమందికి ఇస్తున్నారని ఆరా తీశారు. ఫ్రీ జర్నీ కోసం ఎన్ని ఆర్టీసీ బస్సులు వినియోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే లబ్ధి చేకూర్చాలని సూచించారు. ఎంపీడీవోలు ఫీల్డ్ లో పరిశీలించి ఆరు గ్యారంటీలను  పక్కాగా అమలు చేయాలన్నారు. అడిషనల్  కలెక్టర్లు వెంకటేశ్వర్లు, నర్సింగరావు, సీఈవో కాంతమ్మ, విమల, డీపీవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.

క్వాలిటీ సీడ్స్  అందేలా చూడాలి..

రైతులకు క్వాలిటీ సీడ్స్  అందేలా అగ్రికల్చర్  ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  సంతోష్  ఆదేశించారు. శనివారం కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో వ్యవసాయ పరిస్థితులపై రివ్యూ చేశారు. జిల్లాలో సాగు, వర్షపాతం వివరాలు, రైతుల ఇబ్బందులు ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాధికారులు ఫీల్డ్  విజిట్ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. ఏడీఏలు వెంకటలక్ష్మి, సక్రియా నాయక్, సంగీతలక్ష్మి పాల్గొన్నారు.