డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లన్న కల్యాణం

  • తోట బావి వద్ద ఏర్పాట్లు పూర్తి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం ఆలయ సమీపంలోని తోట బావి వద్ద ఉదయం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ వర్గాలు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారు జామున జరిగే దృష్టికుంభాల కోసం శనివారం సాయంత్రం లింగ బలిజ సమాజం నుంచి  పడిగన్న గారి  వంశస్తులు, మహదేవుని వంశస్తుల వారి ఇండ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి బియ్యాన్ని సేకరించారు.

అనంతరం గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బియ్యాన్ని సేకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయానికి చేర్చారు. స్వామివారి కల్యాణం వారణాసిలోని కాశీ పీఠాధిపతి మల్లికార్జున విశ్వారాధ్యా శివాచార్య భగవత్పాదుల ఆధ్వర్యంలో జరగనుంది. కల్యాణానికి సంబంధించి స్వామివారి నగలు, అమ్మవార్ల పుస్తె, మట్టెలు,వీరభద్ర ఖడ్గాన్ని శుభ్రం చేసి సిద్ధం చేశారు. ఆలయాన్ని రాజగోపురం నుంచి తోటబావి వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.