AP Rains: ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి.. చలి తీవ్రత ఎలా ఉంటుంది..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. అల్పపీడనం బలపడి శ్రీలంక దిశగా వెళ్లడంతో ఏపీలో వర్షం ముప్పు తప్పిందని తెలిపింది వాతావరణ శాఖ.  ఇదిలా ఉండగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది... మంగళవారం ( డిసెంబర్ 31, 2024 ) పొగమంచు దట్టంగా అలుముకుంది. మినుములూరు, అరకు వంటి ప్రాంతాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..  పాడేరులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ. 

ఈ క్రమంలో రానున్న మూడురోజుల పాటు ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని.. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతవరణ శాఖ. రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా చోట్ల చలి తీవ్రత సాధారణంగా ఉండి.. పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ.