వెదర్ అలర్ట్ : బంగాళాఖాతంలో భారీ తుఫాన్.. ఏపీ మీదుగా బెంగాల్ వైపు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ గా మారనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. 2024 మే 23వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంటే.. శ్రీలంక తీరానికి దగ్గరగా.. మచిలీపట్నంకు దూరంగా ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం మే 24వ తేదీ నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారి.. రఈశాన్య దిశగా పయనిస్తూ.. అంటే ఏపీ, ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. 

మే 24వ తేదీ సాయంత్రానికి వాయుగుండం మరింత బలపడి.. మే 25వ తేదీ నాటికి అంటే శనివారం నాటికి తుఫాన్ గా మారుతుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మే 26వ తేదీ సాయంత్రం నాటికి ఇది తీవ్ర తుఫాన్ గా మారి.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దేశ సరిహద్దుల్లో తీరం దాటనున్నట్లు అంచనా వేస్తుంది వెదర్ డిపార్ట్ మెంట్. పశ్చిమ బెంగాల్ లో తీరం దాటే సమయంలో తీవ్ర తుఫాన్ గా ఉండనుందని.. ఆ సమయంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. బీభత్సం సృష్టించనున్నట్లు హెచ్చరించింది. 

మే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దక్షిణ కోస్తా, ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలకు వార్నింగ్ ఇస్తూనే.. మత్స్యకారులు ఎవరూ ఈ నాలుగు రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది భారత వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని.. అదే విధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. 

బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలకు భారీ నష్టం ఉండొచ్చని హెచ్చరిస్తూ.. ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వెదర్ డిపార్ట్ మెంట్.