బీసీలను సంఘటితం చేస్తాం: బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్

నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలందరినీ సంఘటితం చేస్తామని, రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమేనని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​ తెలిపారు. శనివారం నల్గొండలోని ఎస్బీఆర్  ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా రౌండ్ టేబుల్  సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొండా లక్ష్మణ్  బాపూజీ, బొమ్మగాని ధర్మ బిక్షం స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఆశాస్త్రీయంగా దొడ్డి దారిన ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు అమలవుతోందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని చెప్పారు. త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో పూర్తిస్థాయి కమిటీలను వేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయాల చైర్మన్  జెల్లా మార్కండేయ, బహుజన ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసురాం నాయక్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్  పాల్గొన్నారు.