మూతప‌డ్డ షుగర్​ ఫ్యాక్టరీలు తెరిపిస్తాం

  • మంత్రి దామోదర రాజనర్సింహ

రాయికోడ్, వెలుగు: చెరుకు రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్  మండలం మాటూరులో గోదావరి గంగ షుగర్​ ఫ్యాక్టరీని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తో క‌లిసి ప్రారంభించారు. అంత‌కుముందు నాగ్వార్ లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్​ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో12 షుగర్​ ఫ్యాక్టరీలు ఉండగా 6  మూతపడ్డాయని చెప్పారు. ప‌దేండ్ల బీఆర్ఎస్  పాల‌న‌లో ఒక్క ఫ్యాక్టరీని ఓపెన్  చేయ‌లేద‌ని ఎద్దేవా చేశారు.

మూతప‌డ్డ ఫ్యాక్టరీల‌ను తెరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జ‌హీరాబాద్  స‌మీపంలోని ట్రైడెంట్  షుగ‌ర్ ఫ్యాక్టరీలో రైతుల‌కు రావాల్సిన రూ.17 కోట్ల బ‌కాయిల‌ను కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే చెల్లించామన్నారు. ఫ్యాక్టరీలో స్థానికుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని సూచించారు. మధ్యప్రదేశ్  ఎమ్మెల్యే మోంట్  సోలంకి, సెట్విన్  చైర్మన్  గిరిధర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్  అంజయ్య, గోయల్-  బండారి, కైలాస్ చంద్  గోయల్ ​పాల్గొన్నారు.