మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలిస్తాం : మంత్రి సీతక్క

అచ్చంపేట, వెలుగు: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వచ్చే ఐదేండ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామని చెప్పారు. మంగళవారం నల్లమలలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యటించారు. 

అచ్చంపేట పట్టణంలోని ఏసీఆర్  గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని 514 మహిళా సంఘాలకు రూ.50.10 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్​రెడ్డి ఉద్దేశమన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధార్  కేంద్రాలు, మీ సేవా సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్, క్యాంటీన్లతో పాటు వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు లోన్లు ఇస్తామని చెప్పారు. 

కొత్తగా ప్రారంభించనున్న మహిళా శక్తి క్యాంటీన్లు క్లీన్ గా ఉండాలని, క్వాలిటీ ఫుడ్  అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా మారాలని, స్వచ్ఛమైన పల్లె రుచులను రుచి చూపాలని సూచించారు. స్థానికంగా దొరికే వస్తువులతో వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. ఆదర్శ మహిళా పాఠశాలల పనులను, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల స్కూల్  యూనిఫామ్ లను మహిళా సంఘాలతో కుట్టించడం జరిగిందన్నారు. అనంతరం బల్మూరు మండలం జినుకుంట–-పోలేపల్లి బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డీఆర్డీవో చిన్న ఓబులేసు, జడ్పీటీసీ అనురాధ, మంత్రి నాయక్, ఎంపీపీలు శాంతాబాయి, అరుణ పాల్గొన్నారు.