గ్లోబల్ రెసిషన్ ఉన్నా మనకు మంచిదే
వచ్చే 3-4 ఏళ్లలో రూ.2,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం
పేర్కొన్న ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రైట్
న్యూఢిల్లీ : దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి కట్టుబడి ఉన్నామని ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రైట్ ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో దేశంలోని ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్‌లో రూ. 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. గ్లోబల్‌గా పాపులర్ అయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రైట్) ను దేశంలో మొదటిసారిగా ఎంబసీ గ్రూప్, బ్లాక్‌స్టోన్‌లు లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కంపెనీ 3.4 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను బెంగళూరు, ముంబై, పూణె, నోయిడాలలో ఆపరేట్ చేస్తోంది. మార్కెట్‌లో కూడా ఎంబసీ రైట్ లిస్ట్ అయ్యింది. కాగా, రైట్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు రైట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా వచ్చే రెంట్‌ను ఇన్వెస్టర్లకు పంచుతారు. గ్లోబల్‌గా రెసిషన్ భయాలు ఉన్నప్పటికీ దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ మరింత విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని ఎంబసీ రైట్ సీఈఓ వికాశ్ ఖోడ్లోయా అన్నారు. ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్‌లో రెంట్‌లు తక్కువగా ఉండడం, ట్యాలెంట్ ఉన్నవారు అందుబాటులో ఉండడం వలన గ్లోబల్ కంపెనీలో దేశంలో తమ ఆఫీస్‌లను ఓపెన్ చేయాలని చూస్తున్నాయని వివరించారు. గ్లోబల్‌గా రెసిషన్ భయాలు ఉంటే ఇండియాకు మంచిదేనని, లోకల్ కంపెనీలకు అవుట్ సోర్సింగ్ వర్క్ పెరుగుతుందని తెలిపారు. గ్లోబల్ స్టాండర్డ్‌లోని ఆఫీస్ స్పేస్ దేశంలో చదరపు అడుగుకి 1–2 డాలర్లకే అందుబాటులో ఉంటోందని వికాస్ అన్నారు. ‘సుమారు 71 లక్షల చదరపు అడుగుల జాగాను డెవలప్ చేయడానికి రూ.3,200 కోట్ల మూలధనాన్ని ఖర్చు పెడతాం. ఇందులో రూ.1,000 కోట్లను ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాం. రానున్న 3 నుంచి 4 ఏళ్లలో మరో రూ.2,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం’ అని ఎంబసీ రైట్ సీఈఓ వికాశ్ పేర్కొన్నారు. తమ స్పాన్సర్ కంపెనీ ఎంబసీ గ్రూప్ నుంచి చెన్నై, బెంగళూరులోని కొన్ని ఆస్తులను కూడా కొనేందుకు చర్చలు జరుగుతున్నాయని, ఇంకో 120 రోజుల్లో ఈ డీల్ పూర్తవుతుందని వివరించారు.
గ్రీన్ ఎనర్జీలో రూ.22,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్..
దేశ గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌లో జాక్సన్ గ్రీన్ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రాజస్థాన్‌లో రూ.22,400 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లను దశల వారీగా పూర్తి చేస్తామని, ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని వివరించింది. కంపెనీ ఏడాదికి 3,65,000 టన్నుల కెపాసిటీ ఉన్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి అదనంగా ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌లు 2023 నుంచి 2028 మధ్య పూర్తి అవుతాయని, తాజా ఇన్వెస్ట్‌మెంట్ వలన 32 వేల ఉద్యోగాలు (డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్) క్రియేట్ అవుతాయని తెలిపింది.
