- మూడు చోట్ల బోర్‌వెల్స్ ప్రారంభం
- కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు, స్టూడెంట్లు
కోల్‌బెల్ట్, వెలుగు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూర్ మండలం కిష్టంపేట డిగ్రీ కాలేజ్, కొమ్మెరలోని హైస్కూల్, జైపూర్ మండలం వేలాలలోని హెల్త్ సెంటర్ వద్ద తాగునీటి కష్టాలు తీరాయి. దీంతో విద్యార్థులు, రోగులు, హెల్త్ సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా తాగునీటి సౌలత్లు లేక వారు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యను పరిష్కరించాలని గత పాలకులు, అధికారులకు అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే వివేక్ మూడు చోట్ల బోర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్‌ను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో మూడు బోర్లు వేశారు. బోర్‌వెల్స్‌కు ఆదివారం మోటార్లను బిగించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్ లీడర్ హేమవంత్ రెడ్డి తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చుతూ కాకా కుటుంబం నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తోందన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ నెరవేర్చుతూ తాగునీటి కష్టాలు తీర్చారని గ్రామస్తులు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.