లక్నవరానికి జల గండం

  • ఆయకట్టుకు నీళ్లిస్తుండడంతో వేసవిలో ఎండిపోతున్న చెరువు
  • ఈ సారీ క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం
  • టూరిజంపై ప్రభావం
  • రామప్ప నుంచి పైప్‌‌లైన్‌‌  వేస్తే నీటి సమస్యకు పరిష్కారం

జయశంకర్‌‌ భూపాలపల్లి/వెంకటాపూర్‌‌‌‌ (రామప్ప), వెలుగు : రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన లక్నవరం చెరువుకు ‘జలగండం’ పొంచి ఉంది. రెండు వేలాడే వంతెనలతో పాటు ఇటీవలే మూడో ఐలాండ్‌‌ను కూడా ప్రారంభించడంతో లక్నవరం.. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల టూరిస్టులకు ప్రత్యేక డెస్టినీగా మారింది.

కానీ చెరువు కింద ఆయకట్టుకు నీళ్లిస్తుండడంతో గడిచిన కొన్నేళ్లుగా ఎండాకాలం ప్రారంభంలోనే చెరువు ఎండిపోతోంది. నీటిమట్టం తగ్గుతుండడంతో ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఎదురుకానుంది. అలాగని చెరువు కింది భూములకు నీళ్లివ్వకపోతే రైతులకు బతుకుదెరువు ఉండదు. ఇస్తే టూరిస్టుల రాక బంద్‌‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఉభయతారకంగా రామప్ప నుంచి పైప్‌‌లైన్‌‌ నిర్మాణంపై సర్కారు దృష్టిపెట్టాలన్న డిమాండ్‌‌ వినిపిస్తోంది.

రెండేండ్లుగా పూర్తిగా ఎండుతున్న చెరువు

గడిచిన రెండేండ్లలో నీళ్లు లేక లక్నవరం చెరువు పూర్తిగా ఎండిపోయింది. దీంతో వేలాడే వంతెనల కింది నుంచి మట్టి రోడ్ల మీద వెహికల్స్‌‌ సైతం ప్రయాణించాయి. ఈ సారి కూడా చెరువులో నానాటికీ నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే ఐదారు అడుగుల వాటర్‌‌ తగ్గింది. ఆయకట్టు రైతులు ఈ చెరువుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. యాసంగి పంటల సాగుకు నీళ్లు విడుదల చేయాల్సి ఉండడంతో వేసవిలో లక్నవరం చెరువులో నీళ్లుండవని లోకల్‌‌ ప్రజలు చెబుతున్నారు. దీంతో టూరిజానికి కష్టకాలం తప్పదంటున్నారు. 

4,150 ఎకరాల్లో యాసంగి సాగు

కాకతీయుల కాలం నాటి లక్నవరం చెరువు కింద 8,700 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక సారి చెరువు నిండితే రెండు పంటలు పండుతాయి. ఈ యాసంగిలో 4,150 ఎకరాల తైబందీని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు నార్లు పోసుకోవడానికి వీలుగా నీటి పారుదల శాఖ ఆఫీసర్లు తూములు ఎత్తారు.

Also Read : రైతు భరోసాపై కాంగ్రెస్ కుట్రలు

దీంతో చెరువులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది. లక్నవరం సరస్సులో ప్రస్తుతం 28 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నరసింహ సాగర్‌‌ కెనాల్‌‌ మరమ్మతుల సమయంలో తుప్పు పట్టిన షట్టర్‌‌ను తొలగించాడు. మళ్ళీ ఏర్పాటు చేయకపోవడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. కెనాల్‌‌ వెంట సుమారు 300 వరకు విద్యుత్‌‌ మోటార్లు ఉంటాయి. దీంతో పంటకాలం ముగిసే నాటికి లక్నవరం చెరువు పూర్తిగా ఎండిపోవడం ఖాయమని రైతులు అంటున్నారు.

దేవాదుల నీళ్లిస్తే మేలు

దేవాదుల నీళ్లతో లక్నవరం సరస్సును నింపుతామని గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా లక్నవరంలో 365 రోజులూ నీళ్లు ఉండేలా రామప్ప సరస్సు నుంచి ప్రత్యేకంగా పైప్‌‌లైన్‌‌ వేస్తామని చెప్పింది. కానీ తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్‌‌ కనీసం భూసేకరణ కూడా చేపట్టలేదు.

ప్రస్తుతం కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడడంతో రామప్ప నుంచి లక్నవరానికి గోదావరి నీటిని తరలించాలని ప్రజలు కోరుతున్నారు. దీని వల్ల వ్యవసాయ రంగంతో పాటు, టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. తన సొంత నియోజకవర్గ పరిధిలో ఉన్న లక్నవరం అభివృద్ధికి మంత్రి సీతక్క చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న టూరిస్ట్‌‌లు

లక్నవరం సరస్సులో రెండు వేలాడే వంతెనలతో పాటు ఇటీవలే మరో ఐలాండ్‌‌ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ టూరిజం డిపార్ట్‌‌మెంట్‌‌ సహకారంతో ఫ్రీక్‌‌ ఔట్స్‌‌ సంస్థ మూడేండ్ల పాటు శ్రమించి నిర్మించిన ఐలాండ్‌‌ను నవంబర్‌‌ 24న ప్రారంభించారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఈ ఐలాండ్‌‌లో పార్క్‌‌, 20 కాటేజీలను సిద్ధం చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్‌‌ పూల్‌‌, ఆటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గదులను బుక్‌‌ చేసుకున్న వారికి నాలుగు స్విమ్మింగ్‌‌ పూల్స్‌‌ కేటాయించగా, ఒకటి మాత్రం ఓపెన్‌‌గా ఉంచారు. ఐలాండ్‌‌ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ ఐలాండ్‌‌కు బుకింగ్స్‌‌ రోజురోజుకు పెరుగుతున్నాయి. లక్నవరం చెరువులో బోటింగ్‌‌ సైతం ఉండడంతో టూరిస్ట్‌‌లు పెరుగుతున్నారు. కానీ లక్నవరం చెరువు ఎండిపోతే టూరిస్ట్‌‌ల రాక తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.

టూరిజం కోసం  వ్యవసాయాన్ని ఆపలేం కదా.. 

లక్నవరం సరస్సు భారత్‌‌‌‌లోనే బెస్ట్‌‌ టూరిజం ప్లేస్‌‌‌‌. ఇక్కడి రెండు వేలాడే వంతెనలతో పాటు మూడో ఐలాండ్‌‌‌‌ కూడా ప్రారంభం కావడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అయితే రెండేండ్లుగా వేసవిలో నీళ్లు లేక చెరువు ఎండిపోయింది. లక్నవరం వ్యవసాయం సిద్ధం చేసిన చెరువు. దీనిపై ఆధారపడి చాలా మంది రైతులు జీవిస్తున్నారు. టూరిజం కోసం వ్యవసాయాన్ని ఆపలేం. రామప్ప నుంచి లక్నవరానికి గోదావరి నీళ్లు తీసుకువచ్చేందుకు మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు. ఆ పనులు పూర్తయితే లక్నవరం 365 రోజులూ నిండుకుండలా ఉంటుంది.


-శివశంకర్‌‌, లక్నవరం టూరిజం మేనేజర్‌‌-