పానగల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

పానగల్, వెలుగు: పానగల్​ పోలీస్ స్టేషన్ ను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్  శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్​లో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్​లో ఉన్న కేసుల గురించి ఎస్సై శ్రీనివాస్ యాదవ్ ను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్  చేశారనే విషయాన్ని అడిగి తెలుసుకొని, రికార్డులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల విచారణ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎస్సైని అభినందించారు. కేసుల విచారణ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. దీంతో ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరగడంతో పాటు బాధితులకు ఊరట లభిస్తుందన్నారు. సిబ్బంది తమ డ్యూటీ విషయంలో బాధ్యతగా ఉండాలని, స్టేషన్​ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్టేషన్​ ఆవరణలో మొక్కలు నాటారు. సీఐ కృష్ణ, ఏఎస్ఐ పాల్గొన్నారు.