వనపర్తి మున్సిపల్​ చైర్మన్, వైస్​ చైర్మన్ల రాజీనామా

వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపల్​ చైర్మన్​ గట్టుయాదవ్, వైస్​ చైర్మన్​ వాకిటి శ్రీధర్​ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు  మున్సిపల్​ కమిషనర్​ పూర్ణచందర్ కు రాజీనామా లెటర్లను అందజేశారు. చైర్మన్, వైస్​ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని నోటీసు ఇవ్వడంతో, ఈ నెల 27న సమావేశాన్ని నిర్వహించనున్నారు. మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి కౌన్సిలర్లను సముదాయించి వారితో రాజీనామా చేపిస్తానని చెబుతూ వచ్చారు.

ఈ నెల19న రాజీనామా చేస్తారని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరానికి రావాలని వారికి సూచించారు. అయితే రాజీనామా చేసి, ఆమోదం పొందాక శిబిరానికి వస్తామని అసంతృప్త కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో నాటకీయ పరిణామాల నడుమ రిజైన్​ లెటర్లు అందజేశారు. 14 మంది కౌన్సిలర్లు ఒక కౌన్సిలర్​ శిబిరంలో ఉండగా, ఏడుగురు మాజీ మంత్రి ఇంటి వద్ద ఉన్నారు. చైర్మన్, వైస్​ చైర్మన్లు​రాజీనామా చేస్తున్నారని, కౌన్సిలర్లను పిలిపించారు.

అసంతృప్త  కౌన్సిలర్లలో కొందరు కాంగ్రెస్​  పార్టీతో టచ్​లో ఎందుకున్నారంటూ మాజీ మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొత్త చైర్మన్​గా అసంతృప్త కౌన్సిలర్లు సూచించిన వ్యక్తిని మాజీ మంత్రి వద్దన్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే హైకమాండ్​ నిర్ణయం మేరకు తమ పదవులకు రాజీనామా చేసినట్లు చైర్మన్, వైస్​ చైర్మన్లు తెలిపారు.