రుణమాఫీపై బీఆర్ఎస్​ది మొసలి కన్నీరు : తూడి మేఘారెడ్డి

  • వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో​రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేయలేదనే విషయాన్ని మరిచి నేడు రైతుల పక్షాన నిరసన దీక్షలు అంటూ మొసలి కన్నీరు కారుస్తుండడం హాస్యాస్పదంగా ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వనపర్తిలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్​ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరుతో రూ.7.12 లక్షల కోట్ల అప్పు చేసి  జేబులు నింపుకున్నారని, ఆ పార్టీ చేసిన అప్పులకు కాంగ్రెస్  సర్కారు నెలకు రూ.5,600 కోట్ల వడ్డీ చెల్లిస్తుందని చెప్పారు. 

వనపర్తి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి తామే చేశామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల నుంచి వనపర్తి నియోజకవర్గంలోని ఒక్క ఎకరానికైనా నీరు అందుతుందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  పెబ్బేరు సంత స్థలంలో అవకతవకలు చేయకుంటే అదే వేణుగోపాల స్వామి ఆలయంలోకి తడి బట్టలతో రావాలని, అందుకు తాను సిద్ధమని ఎమ్మెల్యే సవాల్​ విసిరారు. 

వనపర్తి బస్టాండ్  సమీపంలోని రాజా వారి స్థలంలోనూ ఎలాంటి అవినీతికి పాల్పడకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రావాలన్నారు. అభివృద్ధి మాటున చేసిన అవినీతిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డికి ఆయన సవాల్​ విసిరారు. కృష్ణా నది కబ్జాపై జోగులాంబ ఆలయానికి వస్తానని, ధైర్యముంటే అమ్మవారి ఆలయంలో చర్చకు రావాలన్నారు.

 వ్యవసాయ శాఖ మంత్రిగా నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఏం ఒరగబెట్టారో? చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు పని వాళ్లను కూడా వదిలి పెట్టని నైజమని ఫైర్​ అయ్యారు. ఓ భూ కబ్జాదారుడికి, రుణమాఫీ చేయని బీఆర్ఎస్​ నాయకులకు రైతు శ్రేయస్సు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రోడ్ల విస్తరణలో  ఇష్టానుసారంగా వ్యవహరించి నిధులు లేకుండానే నిర్మాణాలు చేపట్టామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.