- రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏబీబీ అధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేండ్లుగా పని చేస్తున్న పట్టణానికి చెందిన ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ 2023లో పెబ్బేరులోని 2, 3, 7, 10 వార్డుల్లో పేయింటింగ్, సీసీ రోడ్లకు సంబంధించిన పనులు చేశాడు.
అందులో ఒక్కో దానికి రూ.83,585 చొప్పున 3 పనులకు రూ.2,50,755 బిల్లు రావల్సి ఉంది. బిల్లులు మంజూరు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.20 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. ఆ తరువాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని కమిషనర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. నాంపల్లి ఏసీబీ స్సెషల్ కోర్టులో బుధవారం హాజరు పరుస్తామనిఏసీపీ తెలిపారు.