ఇదేం గలీజు పని.. హైదరాబాద్లో ఉప్పల్ సైడ్ ఉండేటోళ్లు.. సూడండి.!

హైదరాబాద్: బీర్, విస్కీ బాటిల్స్తో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ డంపింగ్ యార్డును తలపించింది. చెత్తాచెదారంతో, బీరు సీసాల కేసులతో నిండిపోయింది. న్యూ ఇయర్ వేడుకల కోసం థ్రైవ్ ఈవెంట్స్కు మున్సిపల్ అధికారులు గ్రౌండ్ ను రెంట్కు ఇచ్చారు. డిసెంబర్ 31న రాత్రి వేడుకల్లో భాగంగా పార్టీని ఎంజాయ్ చేయడానికి వెళ్లిన వాళ్లంతా తెగ తాగేశారు. ఖాళీ బీర్ బాటిళ్లు, విస్కీ బాటిళ్లు, వాటర్ బాటిల్స్ను గ్రౌండ్లో చెల్లాచెదురుగా పడేశారు. ఈవెంట్ నిర్వాహకులు పార్టీ అయిపోగానే గ్రౌండ్ను క్లీన్ చేయించకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ ఖాళీ బీర్ బాటిల్స్, విస్కీ బాటిల్స్తో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ అపరిశుభ్రంగా తయారైంది. ప్రతీ రోజు ఉదయం వందల సంఖ్యలో మున్సిపల్ గ్రౌండ్కు వాకర్స్ వెళుతుంటారు. జనవరి 1, 2025న ఉదయం రోజూలానే వాకర్స్ వాకింగ్ కు వెళ్లారు.

గ్రౌండ్లో చూస్తే ఏముంది.. అంతా చెత్తచెత్తగా ఉంది. తాగి పడేసి ఉన్న బాటిల్స్ చూసి వాకర్స్ షాక్ అయిపోయారు. గ్రౌండ్లో పగిలిపోయిన బాటిల్స్ ఉన్నాయని.. వాకింగ్ ఎలా చేయాలంటూ తిరిగి వెళ్లిపోయారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని వాకర్స్ ఆరోపించారు. ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క ఉప్పల్ ఏరియాలోనే కాదు హైదరాబాద్లోని చాలా చోట్ల న్యూ ఇయర్ ఈవెంట్స్ గ్రాండ్గా జరిగాయి. పార్టీల్లో మద్యం ఏరులై పారింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లలో యూత్ పాల్గొని ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ తో కలిసి ఉర్రూతలూగించే పాటలకు హుషారుగా డ్యాన్సులు చేశారు. కస్టమర్లతో బేకరీలు, స్వీటు షాపులు, రెస్టారెంట్లు కిటకిటలాడాయి. లిక్కర్ షాపులు, వైన్స్ వద్ద మందుబాబులు బారులు తీరి కనిపించారు. సుచిత్రలోని మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్ ముందు అర కిలోమీటరు మేర ఫుడ్ డెలివరీ బాయ్స్, బిర్యానీ ప్రియులు క్యూ కట్టారు. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ ప్రెస్ వే పైకి హెవీ వెహికల్స్ మినహా కార్లను అనుమతించలేదు.