IND vs SA 2024: సౌతాఫ్రికా సిరీస్‌కు హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. కారణం ఏంటంటే..?

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 8న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ నాలుగు టీ20లు ఆడనుంది. సూర్య కుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించనున్నట్లు బీసీసీఐ ఉన్నత అధికారి సోమవారం (అక్టోబర్ 28) ధృవీకరించారు.

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అంతకముందు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు భారత్ ఏ జట్టుతో మూడు మ్యాచ్ ల అనధికారిక టెస్ట్ ఆడుతుంది. నవంబర్ 15 న ఈ మ్యాచ్ జరుగుతుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం టీమిండియా నవంబర్ 10న పెర్త్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే సఫారీతో జరగబోయే టీ20 సిరీస్ కు లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా ప్రకటించారు. 

లక్ష్మణ్ తో పాటు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్, శుభదీప్ ఘోష్ కోచింగ్ స్టాఫ్ గా సౌతాఫ్రికాకు బయలుదేరతారు. ఈ ముగ్గురూ ఇటీవల ఒమన్‌లో జరిగిన ఆసియా ఎమర్జింగ్ కప్ టోర్నీలో భారత కోచ్‌లుగా పనిచేశారు.డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి టీ20 తో సిరీస్ ప్రారంభమవుతుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ లో రెండో టీ20 జరుగుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో వరుసగా మూడు, నాలుగు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తాయి. 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌ కు భారత జట్టు:

సూర్యకుమార్  (కెప్టెన్‌‌‌‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్‌‌‌‌‌‌‌‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌‌‌‌ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌‌‌‌దీప్ సింగ్, విజయ్‌‌‌‌కుమార్ వైశాక్, అవేష్ ఖాన్ , యష్ దయాల్.