ఉండవల్లి శ్రీదేవికి  దక్కని టికెట్ - చంద్రబాబుపై సంచలన ట్వీట్ 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితా ప్రకటించటంతో అన్ని పార్టీల్లో అసమ్మతి, పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. పార్టీ మారిన నేతల్లో కొంతమందికి ఆశించిన టికెట్ దక్కితే, మరికొంతమందికి నిరాశ ఎదురవుతోంది. ఈ క్రమంలో జగన్ పై వ్యతిరేక స్వరం వినిపించి టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు భారీ షాక్ ఇచ్చాడు.

బాపట్ల నుండి టీడీపీ టికెట్ ఆశించిన ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు మొండిచెయ్యి చూపించాడు. తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన శ్రీదేవి చంద్రబాబు పై సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారో ఈరోజు తెలిసొచ్చింది అంటూ కత్తి బొమ్మతో ట్వీట్ చేశారు. శ్రీదేవి ట్వీట్ చంద్రబాబును ఉద్దేశించే అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, చంద్రబాబును నమ్ముకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలిసొచ్చిందా అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు.