ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు.. ఎప్పుడంటే

శ్రీరామనవమి సందర్భంగా ..ఏప్రిల్ 12న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(Koil Alwar Tirumanjanam at Vontimitta) నిర్వహిస్తామని   తిరుమల తిరుపతి దేవస్థానంతెలిపింది. 

 శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం కాగా….  ఏప్రిల్ 12వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(Koil Alwar Tirumanjanam) సందర్భంగా…. ఏప్రిల్ 12న‌ తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. ఆ తర్వాత ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఏప్రిల్ 13న పసుపు దంచే కార్యక్రమం…

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి(Vontimitta Brahmotsavalu) ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. ఏప్రిల్ 17న ప్రారంభము కానున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు.