డేంజర్‌‌ జోన్‌‌లో కొత్తనెట్ వర్క్ వీ!

డేంజర్‌‌ జోన్‌‌లో కొత్తనెట్ వర్క్ వీ!

న్యూఢిల్లీ: టెలికం సెక్టార్‌‌లో విపరీతమైన పోటీని తట్టుకోవడానికి ఐడియా, వొడాఫోన్‌‌ కలిసిపోయి ‘వీ’ అనే కొత్త నెట్‌‌వర్క్‌‌గా ఏర్పడ్డప్పటికీ, ఈ సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. భవిష్యత్‌‌పై ఆడిటర్లే పెదవి విరుస్తున్నారు. సంస్థకు అర్జంటుగా క్యాష్‌‌ అందకపోతే షటర్లు మూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు. మార్చి 2021 క్వార్టర్‌‌లో కంపెనీకి రూ.7,022 కోట్ల లాస్‌‌ రావడంతో వీకి హెచ్చరికలు పంపారు. దీంతో వీ షేర్లు గురువారం 10 శాతం లోయర్‌‌ సర్క్యూట్‌‌ను తాకాయి. కంపెనీకి  వరుసగా 11 సార్లు నష్టాలు వచ్చాయి. డిసెంబరు క్వార్టర్‌‌లో రూ.4,589 కోట్ల నష్టం రాగా, తాజా క్వార్టర్‌‌లో ఆ నష్టం మరింత పెరిగింది. త్వరలోనే వీ స్టాక్‌‌  మరింత తగ్గుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 

అప్పుల కుప్ప...

కంపెనీ ఫైనాన్షియల్‌‌ పెర్ఫార్మెన్స్‌‌ బాగా లేకపోవడంతో క్యాష్‌‌ ఫ్లో విపరీతంగా తగ్గిందని వీ ఆడిటర్ ఎస్‌‌ఆర్‌‌ బాట్లిబాయ్‌‌ అండ్‌‌ అసోసియేట్స్‌‌ క్వార్టర్లీ రిపోర్టులో పేర్కొంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రీఫైనాన్స్‌‌ ద్వారా అప్పులను తీర్చాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే పేమెంట్స్‌‌ చేయడం కూడా కష్టంగా మారిందని స్పష్టం చేసింది.  లీజు పేమెంట్లను మినహాయించి కంపెనీ అప్పుల విలువ రూ .1,80,300 కోట్లకు చేరింది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయిల విలువ రూ .96,270 కోట్లు. ఏజీఆర్‌‌గా రూ.60,960 కోట్లు కట్టాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రూ.23,080 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అదనంగా ఫండ్స్‌‌ తేవడం, బ్యాంకర్లను ఒప్పించడం, కొన్ని ఆస్తులను అమ్మడం, తరువాత కిస్తీ చెల్లింపుపై క్లారిటీ ఇవ్వడం వంటివి చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏజీఆర్​ బకాయిల చెల్లింపును వాయిదా వేసేందుకు డాట్‌‌ నుంచి అనుమతి సాధించాల్సి ఉంటుంది.


వీ షేర్లను వదిలేయండి...

వీ షేర్లకు భవిష్యత్‌‌ లేదని కంపెనీ, ఆడిటర్ల కామెంట్స్‌‌ ను పరిశీలించిన తరువాత ఎనలిస్టులు స్పష్టం చేశారు. కంపెనీ మార్కెట్‌‌ షేర్‌‌ విపరీతంగా తగ్గిందని, కొత్త ఇన్వెస్ట్‌‌మెంట్లు రావడం లేదని చెబుతున్నారు. వీలైనంత త్వరగా వీ షేర్లను అమ్ముకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. క్రెడిట్‌‌ స్విస్‌‌ వీ స్టాక్స్‌‌కు ‘అండర్‌‌పెర్ఫామ్‌‌’ రేటింగ్ ఇచ్చింది. ప్రైస్‌‌ టార్గెట్‌‌ను రూ.7.50 కు తగ్గించింది. మార్చి క్వార్టర్ ఇబిటా బాగానే ఉన్నా, రెవెన్యూ ఆశించినట్టుగా రాలేదని పేర్కొంది. లీవరేజ్‌‌ 21 రెట్లు మాత్రమే ఉందని, ఇంత తక్కువగా ఉంటే మనుగడ సాధ్యం కాదని కామెంట్స్‌‌ చేసింది. ఐసీఐసీఐ డైరెక్ట్‌‌ వీ షేర్‌‌ ప్రైస్‌‌ టార్గెట్‌‌ ను ఏకంగా రూ. 5 కు తగ్గించింది. కంపెనీ పరిస్థితి బాగా లేకపోవడంతో బ్యాంకులు వీపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాము ఇచ్చిన అప్పులకు వడ్డీని, మార్జిన్‌‌ మనీని, సెక్యూరిటీని పెంచాలని కోరాయి. స్పెక్ట్రమ్‌‌, ఏజీఆర్‌‌ బకాయిల చెల్లింపు కోసం మరింత గడువు ఇవ్వాలని డాట్‌‌ను  వీ కోరింది. మార్చి క్వార్టర్‌‌లో 42 లక్షల మంది 4జీ కస్టమర్లను చేర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 11.39 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 31 నాటికి ఆపరేషన్​ ఖర్చులను రూ .4,000 కోట్ల వరకు తగ్గించుకుంటామని, ఇప్పటికే రన్-రేట్ ప్రాతిపదికన  65 శాతం టార్గెట్‌‌ను సాధించామని వీ వివరణ ఇస్తోంది. 4జీ కస్టమర్ల సంఖ్యను కొంచెం పెంచుకున్నప్పటికీ, పెద్దగా లాభం లేదని, అప్పులు పెరుగుతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ స్పష్టం చేసింది. ఫండ్‌‌ రైజింగ్‌‌ కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావడం లేదని పేర్కొంది. స్పెక్ట్రమ్‌‌, ఏజీఆర్‌‌ బకాయిల చెల్లింపు గడువును డాట్‌‌ పొడగిస్తే కాస్త ఫలితం ఉంటుందని కామెంట్‌‌ చేసింది. వీ క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌ డిసెంబరులో రూ.970 కోట్లు కాగా, మార్చి క్వార్టర్‌‌లో రూ.1,540 కోట్లకు పెరిగిందని మోతీలాల్‌‌ ఓస్వాల్‌‌ పేర్కొంది.