న్యూఢిల్లీ: వోడాఫోన్ఐడియా లిమిటెడ్ తాను చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ. 8,837 కోట్లను కట్టలేకపోతోంది. ఈ బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిల చెల్లింపు కోసం టెలికం డిపార్ట్మెంట్ జూన్ 15 న కోరిందని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ తెలిపింది. 2016–17 తర్వాత రెండు ఫైనాన్షియల్ ఇయర్స్‌కు సంబంధించిన ఈ బకాయిల చెల్లింపు సుప్రీం కోర్టు తీర్పు పరిధిలోవి కావని పేర్కొంది. 2018–19 ఫైనాన్షియల్ ఇయర్ దాకా ఏజీఆర్ సంబంధ బకాయిలన్నింటి చెల్లింపునకు తమకు టెలికం డిపార్ట్మెంట్ నాలుగేళ్ల మారటోరియం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ అవకాశాన్ని వాడుకోవడానికి జూన్ నెలాఖరు లోపు (15 రోజుల గడువు) సమ్మతి తెలియచేయాల్సిందిగా టెలికం డిపార్ట్మెంట్ తమను కోరినట్లు పేర్కొంది. ఈ ఏజీఆర్ సంబంధ బకాయిలపై వడ్డీని కూడా ఈక్విటీగా మార్చుకునే వీలు ఉన్నట్లు వివరించింది. ఇందుకు 90 రోజుల దాకా గడువున్నట్లు డిపార్ట్మెంట్ఆ లెటర్లో తెలిపినట్లు వోడాఫోన్ ఐడియా పేర్కొంది. తాజా డిమాండ్ కూడా రివిజన్ పరిధిలో ఉందని, అప్పుడు ఎంత తేలితే అంత కట్టాల్సి వస్తుందని తెలిపింది. రూ. 16 వేల కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చుకోవడానికి ఇప్పటికే వోడాఫోన్ ఐడియా లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కంపెనీ ఈక్విటీలో 33 శాతం వాటా ప్రభుత్వానికి లభిస్తుంది. 2018–19 ఫైనాన్షియల్ ఇయర్ దాకా టెలికం కంపెనీలు మొత్తం రూ. 1.65 లక్షల కోట్లను ఏజీఆర్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
