స‌రుకుల మ‌ధ్య దాక్కొని హైద‌రాబాద్ నుంచి విజ‌య‌న‌గ‌రానికి..

స‌రుకుల మ‌ధ్య దాక్కొని హైద‌రాబాద్ నుంచి విజ‌య‌న‌గ‌రానికి..

లాక్‌డౌన్ వేళ న‌గ‌రంలో చిక్కుకొని, సొంతూళ్లకు వెళ్లలేక వ‌ల‌స కార్మికులు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఎలాగైనా త‌మ ఊళ్ల‌కు వెళ్లాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాల్లో హైద‌రాబాద్ నుంచి విజ‌య‌న‌గ‌రం బ‌య‌ల్దేరిన కొంద‌రు వ‌ల‌స కార్మికులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

హైదరాబాద్‌ నుంచి నిత్యావసర సరకులతో విజయనగరం వచ్చిన రెండు వాహనాల్లో 31మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించారు. రెండు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్ నుంచి బయలుదేరిన వీరంతా.. ఆ వాహనాలు చెక్‌పోస్టుల వద్దకు రాగానే సరకుల మధ్య దాక్కున్నారు. గత అర్ధరాత్రి దాటాక విజయనగరంలోని గజపతినగరం చేరుకున్నారు. ఆ రెండు వాహనాల మీద అనుమానం రావడంతో పోలీసులు సరకులను పరిశీలించారు. అందులో 31 మంది ఉన్నారని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని పార్వతీపురం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అందరికీ వైద్యపరీక్షలు జరపనున్నారని పోలీసులు వెల్లడించారు. వారంతా బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం మండలాలకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఆ రెండు వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

vizianagaram Police detained 31 workers who are travelled from hyderabad