మాజీమంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత అధికార వైసీపీపై, సీఎం జగన్ పై ఘాటైన విమర్శలు చేశారు. వివేకా ఐదవ వర్థంతి సందర్బంగా కడపలో ఏర్పాటు చేసిన సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. జగన్ చేసిన ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీశారు. వివేకానందరెడ్డి బతికి ఉన్నంత కాలం వైఎస్సార్ కోసం పని చేశారని, ఉమ్మడి కుటుంబం కోసం కష్టపడ్డాడని అన్నారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని నిత్యం ఆలోచించే వారని, అలాంటి వ్యక్తికి కీడు చేయటానికి మనసు ఎలా వచ్చిందని అన్నారు.
వైఎస్సార్సీపీ పునాదులు వివేకా రక్తంలో, కోడికత్తి శీను రక్తంలో ఉన్నాయని అన్నారు. వివేకా హత్య కేసులో తమపై నిందలు మోపటానికి కొంచెమైనా ఎబ్బెట్టుగా లేదా అని ప్రశ్నించారు. పదేపదే తమపై ఆరోపణలు చేయటానికి సిగ్గుగా లేదా అని అన్నారు. సాక్షిలో తమపై తప్పుడు కధనాలు రాస్తున్నారని, సాక్షి ఛైర్మెన్ భారతికి ఓ విన్నపం, మీ వద్ద ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వండి, ఆధారాలు ఉండి కూడా పోలీసులకు ఇవ్వకపోవటం నేరమని అన్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భవిష్యత్తు కోసం పార్టీ నుండి బయటకు రావాలని, ఆ పార్టీలో ఉంటె వారికి కూడా పాపం చుట్టుకుంటుందని అన్నారు