- మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్: వివేక్ వెంకటస్వామి
- మన్మోహన్, కాకా మంచి స్నేహితులని వెల్లడి
- మాజీ ప్రధాని పార్థివదేహానికి నివాళి
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన కృషిని దేశప్రజలు ఎన్నటికీ మర్చిపోరని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మోతిలాల్ మార్గ్ 3లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే, సొదరుడు గడ్డం వినోద్ తో కలిసి నివాళి అర్పించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. దేశం గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు వర్క్ వంటి కీలక సంస్కరణలను తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కీర్తించారు. ఆయన తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకం పేదవారికి ఎంతో మేలు చేసిందని... లక్షలాది మంది పేదల ప్రజలకు ఈ స్కీం కడుపునింపిందన్నారు. 8 శాతం జీడీపీ గ్రోత్ సాధించడంలో మన్మోహన్ సింగ్ కృషి మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రభావం దేశంపై పడకుండా చూసిన ఘనత ఆయనకే సొంతమన్నారు.
తన తండ్రి కాకా వెంకటస్వామి తో మన్మోహన్ సింగ్ కి మంచి స్నేహం ఉందని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్న సమయంలో గ్రామీణ, మారుమూల ప్రాంత పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చాలని కాకా కోరడంతో వారిని ఆదుకునేందుకు మన్మోహన్రూ.25 వేల కోట్లతో రూరల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రతిపాదించారని వివరించారు. అలాగే తను ఎంపీగా ఉన్నప్పుడు కోరగానే.. రూ.10 వేల కోట్ల రుణం మాఫీ చేసి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్సీఎల్)రీఓపెన్కు సహకరించారని కొనియాడారు.
మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త: వినోద్
దేశ ప్రధానిగానే కాకుండా గొప్ప ఆర్థికవేత్తగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఖ్యాతి గడించారని గడ్డం వినోద్ అన్నారు. దేశ ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు.
మన్మోహన్ సేవలు చరిత్రలో నిలుస్తాయి: ఎంపీ వంశీ కృష్ణ
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. మన్మోహన్ సింగ్, కాకా మంచి స్నేహితులని రాజకీయాలకు అతీతంగా వారి స్నేహం కొనసాగిందని తెలిపారు. ఇద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాలు రూపొందించారని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. మన్మోహన్ ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.