బాత్రూంలో షార్ట్‌ సర్క్యూట్‌తోనే విశాఖ రైల్వే ప్రమాదం: సీపీ

 విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బీ 6, బీ 7, ఎం 1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది. 


కాగా ఈ ఘటనపై హోంమంత్రి అనిత డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ సీపీ ఫకీరప్ప తెలిపారు. బీ7 బోగీలోని బాత్రూంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించారమన్నారు. ప్రమాదానికి ముందే రైలు నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారన్నారు. రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలార్పారని చెప్పారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేశామని పేర్కొన్నారు.