తమిళనాడులో విశాక కొత్త ప్లాంట్‌‌… రూ. 100 కోట్ల పెట్టుబడి

తమిళనాడులో విశాక కొత్త ప్లాంట్‌‌… రూ. 100 కోట్ల పెట్టుబడి

వీనెక్స్ట్‌‌ రేంజ్‌‌ ప్రొడక్ట్స్‌‌ తయారీకి తమిళనాడులో రూ. 100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌‌ పెట్టనున్నట్లు విశాక ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ వెల్లడించింది.  తమిళనాడులో ఏ ప్రాంతంలో కొత్త ప్లాంట్‌‌ను నెలకొల్పాలనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 15 నెలల కాలంలో నిర్మాణం పూర్తయ్యే ప్లాంట్‌‌కు ఏటా 2.20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉంటుంది.

విశాక ఇండస్ట్రీస్‌‌ ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానాలలో వీనెక్స్ట్‌‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. పర్యావరణానికి  హాని కలిగించని మెటీరియల్స్‌‌తో వీనెక్స్ట్‌‌ రేంజ్‌‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్లైవుడ్‌‌, జిప్సమ్‌‌ ప్లాస్టర్‌‌ బోర్డులకు ప్రత్యామ్నాయంగా వీనెక్స్ట్‌‌ రేంజ్‌‌ ఉత్పత్తులను విశాక ఇండస్ట్రీస్‌‌ మార్కెట్లోకి తెచ్చింది. నిర్మాణానికి అత్యంత అనువైన రీతిలో వీనెక్స్ట్‌‌ రేంజ్‌‌ను అందిస్తున్నారు. నీరు, నిప్పులను తట్టుకునే సామర్ధ్యంతో ఈ ఆటోక్లేవ్డ్‌‌ ఫైబర్‌‌ సిమెంట్‌‌ బోర్డులను ఉత్పత్తి చేస్తున్నారు. వీనెక్స్ట్‌‌ డివిజన్‌‌ విస్తరణ వ్యూహాత్మకంగా చేపడుతున్నామని, తమిళనాడులో యూనిట్‌‌ నిర్ణయం ఆ దిశలో తీసుకుంటున్న చొరవేనని విశాక ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ జాయింట్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్ వంశీ గడ్డం చెప్పారు. వీనెక్స్ట్‌‌ రేంజ్‌‌ ప్రొడక్ట్స్‌‌కు పెరుగుతున్న డిమాండ్‌‌ను తట్టుకునేందుకే  కొత్త ప్లాంట్‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫైబర్‌‌ సిమెంట్‌‌ బోర్డుల తయారీ రంగంలో విశాక ఇండస్ట్రీస్‌‌ అధిపత్యం కొనసాగించడానికి ఈ కొత్త ప్లాంట్‌‌ సాయపడుతుందనే విశ్వాసాన్ని వంశీ వ్యక్తం చేశారు. ప్లైవుడ్‌‌, జిప్సమ్‌‌ బోర్డులకు ధీటైన ప్రత్యామ్నాయంగానే వీనెక్స్ట్‌‌ ప్రొడక్ట్స్‌‌ను అభివృద్ధిపరుస్తున్నట్లు తెలిపారు.