హైదరాబాద్, వెలుగు: తక్కువ ఖర్చుతో అన్ని వర్గాలకూ డయాలసిస్ చికిత్సను అందించడానికి హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ న్యూయార్క్ లోని రీనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా అలో – హీమోడయాలిసిస్ (ఆలో–హెచ్‌డీ) పరికరాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇది టర్మినల్ కిడ్నీ ఫెయిల్యూర్‌కు చవకైన చికిత్స. ఈ చికిత్స కిడ్నీ వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలకు ఎంతో మేలు చేస్తుంది.
ఆలో హెచ్‌డీ పరికరం సాయంతో సాధారణ వ్యక్తి కిడ్నీ ద్వారా రోగి కిడ్నీని డయాలసిస్ చేయవచ్చు. ఈ పరికరం ఎంతో చౌక అని, ఎవరైనా డయాలసిస్ చేయవచ్చని ఆర్‌ఆర్‌ఎన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ కొటాంకో చెప్పారు. రెనల్ రిప్లేస్‌మెంట్ థెరపీ (ఆర్‌ఆర్‌టీ)లో భాగమైన ఈ చికిత్సను అందించడానికి ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ కె ఎస్ నాయక్, విరించి హాస్పిటల్స్ చైర్మన్ విశ్వనాథ్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌ఆర్టీపై స్టడీ చేయడంలో భాగంగా జంతువులపై ప్రయోగాలు చేస్తామన్నారు.
