IND vs AUS: స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్.. సహనం కోల్పోయిన కోహ్లీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతుంది. ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను ఆడడంలో మరోసారి తన బలహీనతను బయట పెట్టి వికెట్ చేజార్చుకున్నాడు. తాజాగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా శనివారం (జనవరి 4) కోహ్లీ ఇదే సీన్ రిపీట్ చేశాడు. స్కాట్ బోలాండ్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని ఆడే క్రమంలో బంతి కోహ్లీ బ్యాట్‌కు ఎడ్జ్ అయి స్లిప్ లో ఉన్న స్మిత్ చేతిలోకి వెళ్లింది. దీంతో 6 పరుగులకే కింగ్ పెవిలియన్ కు చేరాడు.

కోహ్లీ ఈ సిరీస్ మొత్తం ఇదే తరహాలో ఔట్ కావడం విశేషం. ఆఫ్ సైడ్ బంతులను కదిలించుకొని స్లిప్ లేదా కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోసారి అదే రీతిలో ఔట్ కావడంతో కోహ్లీ తన సహనాన్ని కోల్పోయాడు. ఔటయ్యాక క్రీజ్ లో తనను తాను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. డగౌట్ కు వెళ్లే ముందు బ్యాట్ ను గట్టిగా విసిరేయబోయాడు. ఈ మధ్య ప్రశాంతంగా కనిపించే కోహ్లీ.. తన సహనం కోల్పోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో సైతం  బోలాండ్ బౌలింగ్ లో ఔట్ కావడం గమనార్హం. 

Also Read : ఫీల్డింగ్ చేస్తుండగా గాయంతో రక్తం

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 145 పరుగులకు చేరింది. క్రీజులో రవీంద్ర జడేజా (8 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) ఉన్నారు.