IND vs AUS: కోహ్లీ అత్యుత్సాహం.. 19 ఏళ్ల కుర్రాడితో గొడవ

మెల్‌బోర్న్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు వాడీవేడిగా సాగుతోంది. తన ఆట తీరుతో, అగ్రెసివ్‌నెస్‌తో  కోట్లాది అభిమానులను సంపాదించుకున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వారి చేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న 19 ఏళ్ల కుర్రాడితో గొడవకు దిగటమే అందుకు కారణం.

ఏం జరిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల యువకుడు సామ్ కొంటాస్ ఆస్ట్రేలియా తరపున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతని పట్ల కోహ్లీ అత్యుత్సాహం చూపాడు. ధాటిగా ఆడుతున్నాడన్న కోపంతో.. అతన్ని భుజంతో ఢీకొట్టడమే కాకుండా మాటల యుద్ధానికి దిగాడు. వెంట‌నే ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఈ గొడవ తరువాత కొంటాస్ మరింత చెలరేగిపోయాడు. తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కోహ్లీ చర్యలు అతని ఏకాగ్రత‌ను దెబ్బ తీసేలా ఉన్నప్పటికీ.. ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో జ‌రిమానా ప‌డే అవ‌కాశము న్నట్లు కథనాలు వస్తున్నాయి. 

నిలకడగా ఆసీస్‌ బ్యాటింగ్‌

సామ్ కొంటాస్ మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఆసీస్‌ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఉస్మాన్‌ ఖవాజా(57*) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఎండ్ లో మార్నస్ లబుషేన్‌ (33*) పరుగులతో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 43 ఓవర్లు ముగిసేసరికి 154/1.