IND vs AUS: నా దగ్గర ఏమీ లేదు.. జేబు చూపిస్తూ ఆసీస్ అభిమానులను ఎగతాళి చేసిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆస్ట్రేలియా అభిమానులకు కౌంటర్ ఇచ్చాడు. బుమ్రా లేకపోవడంతో భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడుతున్న కోహ్లీ.. మూడో రోజు ఆటలో భాగంగా సరదాగా ప్రేక్షకులను అలరించాడు. తన రెండు జేబులను చూపిస్తూ.. నా దగ్గర ఏమీ లేదు.. నా జేబు ఖాళీ అన్నట్టు ప్రేక్షకుల వైపు చూశాడు. కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానులను ఎగతాళి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 

మార్చి 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా బ్యాటర్ బాన్‌క్రాఫ్ట్ ఒక సాండ్‌పేపర్ ముక్కను జేబులో పెట్టుకురాగా.. ఆ పేపర్ సాయంతో మైదానంలో బంతి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంలో అతనికి అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మద్దతు పలికారు. ఈ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కెమెరాలో బంధించబడటంతో వీరి బాగోతం బయటపడింది. ఆపై మ్యాచ్ ముగిశాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాన్‌క్రాఫ్ట్ తప్పును(సాండ్‌పేపర్‌ ఉపయోగించడం) అంగీకరించాడు. అప్పుడు  బాన్‌క్రాఫ్ట్  చేసిన పనిని ఇప్పుడు కోహ్లీ ఇమిటేట్ చేస్తూ ఆసీస్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇచ్చాడు.

Also Read :- బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్‌‌‌‌!

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తుంది. 162 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 46 పరుగులు చేయాలి. క్రీజ్ లో హెడ్ (18) వెబ్ స్టర్ (10) ఉన్నారు. మరోవైపు భారత్ విజయానికి 6 వికెట్లు కావాలి. గాయం కారణంగా మూడో రోజు బుమ్రా బౌలింగ్ కు రాకపోవడం టీమిండియా ఓటమిపై ప్రభావం చూపించింది.