IND vs AUS: గొడవలో కోహ్లీదే తప్పని తేల్చిన మ్యాచ్ రిఫరీ.. భారీ జరిమానా

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సామ్ కొంటాస్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవలో భారత స్టార్‌దే తప్పని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తేల్చారు. ఈ క్రమంలో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.

Also Read :- కోహ్లీ కావాలనే గొడవకు దిగాడు.. ముమ్మాటికీ అతనిదే తప్పు

మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని కోహ్లీ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. జరిమానాతో సరిపెట్టారు కనుక కోహ్లీపై నిషేధం వంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. నిజానికి ఐసీసీ ప్రవర్తనా నియమావళి 2.12 ప్రకారం, ఇలాంటి ఘటనల్లో ఒక ఆటగాడు..ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడి పట్ల భౌతికంగా ప్రమేయం ఉన్నట్లు తేలితే ఒక మ్యాచ్ నిషేధం ప‌డనున్నట్లు చెప్తున్నాయి. కోహ్లీ స్టార్ కనుక మ్యాచ్ రిఫరీ.. ఈ తప్పును లెవల్ 1 కింద పరిగణించినట్లు తెలుస్తోంది. దాంతో జరిమానాతో సరిపెట్టారు.

అసలేం జరిగింది..?

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ అరంగేట్రం చేసిన 19 ఏళ్ల యువకుడు సామ్ కొంటాస్ పట్ల కోహ్లీ అత్యుత్సాహం చూపాడు. క్రీజు పక్కన ఇద్దరూ ఎదురెదురుగా వెళ్తున్న సమయంలో ఒక‌ర్ని ఒక‌రు ఢీకొన్నారు. వైరల్ అవుతోన్న వీడియోలో కోహ్లీ కావాలనే కొంటాస్‌ను ఢీకొట్టిన‌ట్లు అనిపిస్తోంది. విరాట్‌ కావాలనే తన డైరక్షన్‌ మార్చుకున్నట్లు కనపడుతోంది. గొడవ పెద్దది అయ్యేలా కనపడటంతో.. వెంటనే మరో ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పారు.

ఈ గొడవపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. కోహ్లీ చర్యను ఆమోదించలేదని, ఇది అనవసరమని అన్నారు.