ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. 12 ఏళ్ళ తర్వాత టాప్-25 నుంచి కోహ్లీ ఔట్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో వెనకపడ్డాడు. సిరీస్ కు ముందు 24 వ స్థానంలో ఉన్న విరాట్.. తాజాగా ఐసీసీ బుధవారం (జనవరి 8) ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు దిగజారి 27 వ స్థానానికి పడిపోయాడు. 2013 తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ టాప్ 25 లో లేకపోవడం ఇదే తొలిసారి. 2012 లో కోహ్లీ 36వ స్థానంలో ఉన్నాడు. 

కోహ్లీ కంటే దారుణ ఫామ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి 42 వ స్థానంలో నిలిచాడు. భారత ఆటగాళ్లలో జైశ్వాల్ (4), రిషబ్ పంత్ (9) మాత్రమే టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బావుమా మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ 8 వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

ALSO READ | NZ vs SL: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. హ్యాట్రిక్‌తో చెలరేగిన శ్రీలంక బౌలర్

బౌలింగ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. కమ్మిన్స్ రబడాను వెనక్కి నెట్టి రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా 9 వ స్థానంలో ఉన్నాడు. సిడ్నీ టెస్టులో 10 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి టాప్ 10కి చేరుకోవడం విశేషం. ఆల్ రౌండర్లలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కోస్ జాన్సెన్ 294 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. జడేజా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.