కోలుకున్న వినోద్ కాంబ్లీ.. ఆస్పత్రిలో డ్యాన్స్‌లు

అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే ఆయన.. ఆస్పత్రిలో డ్యాన్స్ చేశారు. చక్ దే ఇండియా పాటకు చిందులేస్తూ ఆయన చాలా ఉల్లాసంగా కనిపించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది కాలు కదిపిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

అందరికీ కృతజ్ఞతలు..: కాంబ్లీ 

తాను కోలుకోవడం పట్ల కాంబ్లీ.. అభిమానులు, కుటుంబసభ్యులు, వైద్య బృందం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ వల్లే నేను ఇంకా బ్రతికున్నాను అని అర్థం వచ్చేలా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పంచుకున్నారు.

యూరినరీ ఇన్ఫెక్షన్, కండరాల తిమ్మిరి సమస్యలతో డిసెంబర్ 21న వినోద్ కాంబ్లీ మహారాష్ట్రలోని థానే ఆసుపత్రిలో చేరారు. తదుపరి జరిపిన వైద్య పరీక్షల్లో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తేలడంతో మెరుగైన చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దాంతో, ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకొని డ్యాన్స్ చేయడం అందరిలో ఆనందాన్ని నింపుతోంది.

భారత మాజీ  దిగ్గజం సచిన్ టెండూల్కర్‌, వినోద్ కాంబ్లీ మంచి స్నేహితులు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన కాంబ్లీ టెస్టుల్లో గొప్ప క్రికెటర్ అయ్యేలా కనిపించారు. ఒక దశలో సచిన్ కంటే ప్రతిభావంతమైన ఆటగాడిగా కీర్తింపపడ్డారు. ఆ తరువాతే ఆయన కెరీర్ గాడి తప్పంది. జట్టుకు దూరమైన కాంబ్లీ మద్యానికి బానిసై అనారోగ్యం బారిన పడ్డారు. 2012లో కాంబ్లీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలో చేరడం.. కోలుకోవడం.. మరలా ఆస్పత్రి పాలవ్వడం జరుగుతూనే ఉంది. భారత్ తరపున వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడారు.