ప్రకృతి పండుగ వినాయక చవితి

నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు సూత మహామునిని ప్రశ్నిస్తూ సర్వకార్యాలు సిద్ధించే మార్గమేమిటి?  కార్యసిద్ధికి ఏ దేవతను పూజించాలి? అంటూ అడిగారు. దానికి సూతమహాముని సమాధానం ఇస్తూ  ‘పూర్వం ధర్మరాజు ఇలాగే కృష్ణుణ్ణి ప్రశ్నించగా ఆయన ‘గణాధ్యక్షుడు, సిద్ధదాయకుడైన గణేశుడిని భాద్రపద శుక్ల చతుర్ధినాడు భక్తితో పూజించి కార్యసిద్ధి పొందండి’ అని తెలిపినట్లు చెప్పాడు.

వినాయకుడికి గణాధిపత్యం

వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ శివపుత్రులు. వీరిలో గణాధిపత్యం, తొలిపూజ ఎవరికి ఇవ్వాలని వాదోపవాదం జరిగింది. ఎవరు ముందుగా అన్ని లోకాలను చుట్టి వస్తారో వారికివ్వాలనే నిర్ణయం జరిగింది. వినాయకుడి పొట్ట పెద్దది. ఆయన వాహనం మూషికం చిన్నది.   కుమార స్వామి శరీరం తేలికగా ఉంటుంది, 'పైగా నెమలి  వాహనం కనుక వెంటనే లోకాలను చుట్టడానికి వెళ్ళిపోయాడు. వినాయకుడు మాత్రం 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’అన్నట్లుగా ఈ సృష్టికే మాతాపితరులైన తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు, తల్లిదండ్రులను దైవ సమానంగా పూజించాలన్న వైదిక ధర్మసందేశం ఆచరణలో చూపించాడు వినాయకుడు.  వినాయకుడికి తల్లిదండ్రులపట్ల గల భక్తికి కూడా మెచ్చి ‘గణాధిపత్యం’ అందించారు ఆదిదంపతులు.

అప్పటి నుంచి వినాయకుడు..విఘ్నకారకుడు, విఘ్న నివారకుడు అయ్యాడు. త్రిలోకాలను శాసించగల శివుడికే  గణేశుడు మొదట విఘ్నం కల్గించాడు కాబట్టి శివుడు గణేశుడికి ఏనుగు తల అతికించాక ‘విఘ్నేశ్వరుడు’ అని నామకరణం చేశాడు. ఇక నుంచి ఎవరు ఏ కార్యం తలపెట్టినా అది నిర్విఘ్నంగా నెరవేరుటకు వినాయకుడిని పూజించాలని పరమేశ్వరుడు లోకానికి తెలియజేశాడు.  విఘ్నేశ్వరుడికి సిద్ధి, -బుద్ధులను భార్యలుగా చెప్తారు. వారివల్ల క్షేముడు,- లాభుడు అనే పుత్ర సంతానం కలిగిందని అంటారు. పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు విఘ్నేశ్వరుడికి గణాధిపత్యం ఇచ్చాడు. అప్పటి నుంచి చతుర్థినాడు  భక్తజనులంతా వినాయకుణ్ణి  షోడశోపచారాలతో పూజించి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్లు, ఫలాలు సమర్పిస్తున్నారు.   

21 పత్రాలు - పర్యావరణం - ఆయుర్వేదం 

శివుణ్ణి బిళ్వదళాలతో,  లక్ష్మీదేవిని కమలాలతో,  విష్ణువును తులసితో, హనుమను తమలపాకులతో పూజించడం ప్రశస్తం.  వినాయకుణ్ణి మాత్రం 21 రకాల పత్రాలతో పూజించడం ప్రత్యేకం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు పంచభూతాలు, పంచప్రాణాలు, ఒక ప్రాణం మొత్తం కలసి 21.  వీటి గొప్పతనం ఇందులో కన్పిస్తుంది. అలాగే,  నైవేద్యంగా ఉండ్రాళ్లు, కుడుములు గణపతికి ఇష్టమైనవి.  

21 రకాల పత్రాలు ప్రకృతి సిద్ధమై, ఔషధ గుణాలు కలిగినవి.వీటన్నిటికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం ఉంది. అంతేగాకుండా మనం వీటి సేకరణ చేసేటప్పుడు మన పిల్లల్ని మన వెంట తీసుకెళ్తే  ప్రకృతి తత్వం-, ఆయుర్వేద విశిష్టత వాళ్లు తెలుసుకొంటారు. పర్యావరణ విజ్ఞానం వాళ్ళకి కల్గించిన వాళ్లమవుతాం.

- డా. పి.భాస్కర యోగి