ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతున్న కడప రాజకీయాలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల జగన్, అవినాష్ రెడ్డిలపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డి హంతకుడని, చిన్నాన్నను చంపిన హంతకుడికి ఎంపీ టికెట్ ఇచ్చాడంటూ జగన్ పై ప్రత్యక్ష దాడికి దిగుతున్నారు.
ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి, జగన్ మేనత్త విమలమ్మ షర్మిల, సునీతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పరువును రోడ్డుకు లాగుతున్నారని మండిపడ్డారు. వివేకాను చంపిన హంతకుడు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే అమాయకుడైన అవినాష్ ను హంతకుడు అంటూ ఆరోపించడం అన్యాయం అని అన్నారు. పదే పదే అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నారని అన్నారు. జగన్ మీద కక్షతోనే సునీత, షర్మిల ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు విమలమ్మ.