ఆర్డీవోను అడ్డుకున్న మైలారం గ్రామస్తులు

  • మైనింగ్  రద్దు చేస్తేనే ఓట్లు వేస్తామని స్పష్టీకరణ

అచ్చంపేట, వెలుగు: ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం మైలారం గుట్టపై తవ్వకాలకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మైనింగ్  పర్మిషన్ ను రద్దు చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్​ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన గ్రామస్తులు అధికారులు, ప్రజా ప్రతినిధులను గ్రామంలోకి రానివ్వమని తేల్చిచెప్పారు. పార్లమెంట్  ఎన్నికలకు సంబంధించిన ఓటర్  స్లిప్పులను పంచనివ్వడం లేదనే సమాచారంతో మంగళవారం గ్రామానికి వచ్చిన అచ్చంపేట ఆర్డీవో మాధవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. 

మైనింగ్ పనులు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు ఇస్తేనే, పోలింగ్ లో పాల్గొంటామని తేల్చి చెప్పారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికలను బహిష్కరించడం సరికాదని, ఓటింగ్ లో పాల్గొనాలని ఆర్డీవో సూచించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామని చెప్పినా గ్రామస్తులు వినలేదు. ‘గో బ్యాక్, సేవ్  మైలారం’ అంటూ నినాదాలు చేస్తూ అధికారులను గ్రామం నుంచి తిప్పి పంపారు. గ్రామస్తులు శ్రీనివాసులు, నిరంజన్, వెంకటేశ్, వెంకటయ్య, బుచ్చిరెడ్డి, సైదమ్మ, కృష్ణారెడ్డి, వెంకటేశ్​గౌడ్, రాములు, మోతే వెంకటేశ్​ పాల్గొన్నారు.