సహోద్యోగిని వేధించిన హెడ్మాస్టర్ కు చెప్పులదండ

సహోద్యోగిని వేధించిన హెడ్మాస్టర్ కు చెప్పులదండ

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌ భూమ్‌ జిల్లా బాచ్‌ మగుతు గ్రామంలో ఘటన
రాంచీ:
తన స్కూల్ లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి గ్రామస్తులు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. రోజు రోజుకూ ప్రవర్తన శృతిమించి అశ్లీల పదజాలంతో దూషించడంతో బాధితురాలు తన గోడును గ్రామస్తులకు తెలియజేసింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో స్కూల్ వద్దకు వచ్చి హెడ్మాస్టర్ కు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా మెడలో చెప్పులదండ వేసి గ్రామంలో ఊరేగించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పులదండ వేసుకుని నడుస్తున్న హెడ్మాస్టర్ ను అనుసరిస్తూ వీధివీధినా కలియతిరిగారు. కొందరు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌ భూమ్‌ జిల్లా బాచ్‌ మగుతు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రమేశ్‌ చంద్ర హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇదే స్కూల్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయినిని రమేశ్‌ చంద్ర తరచూ  చులకన చేస్తూ అవహేళనలకు గురిచేసేవాడు. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందావని.. నీ బండారం బయటపెట్టకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని వేధించేవాడని బాధితురాలు కంటతడిపెట్టుకుంది. అతని వేధిపుల గురించి ఆడియో.. వీడియోలు రికార్డు చేసి పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు చూపించింది. బాధితురాలిపట్ల హెడ్మాస్టర్ చాలా హీనంగా ప్రవర్తించినట్లు గుర్తించిన గ్రామస్తులు హెడ్మాస్టర్ ని పట్టుకుని చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా.. చెప్పులు.. బూట్లతో మెడలలో దండ వేసి గ్రామంలో వీధివీధినా ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన వీడియోలపై హెడ్మాస్టర్ రమేశ్‌ చంద్ర ను ప్రశ్నించగా.. తప్పుడు ఆరోపణలతో తనను అవమానించారని వాపోయారు. ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేస్తే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని.. తన నిజాయితీ బయటపడుతుందని పేర్కొన్నాడు.