ఊళ్లోకి నీళ్లు రావడంతో..

  • సురక్షిత ప్రాంతాలకు చిన్నోనిపల్లి నిర్వాసితులు

గద్వాల, వెలుగు: వర్షాలతో చిన్నోనిపల్లి రిజర్వాయర్ లోకి వరద వస్తుండడంతో గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయని చెప్పినా తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాత్రి వేళ అకస్మాత్తుగా వరద పెరిగితే మునిగిపోతామన్న భయంతో గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

బుధవారం గ్రామంలోని ఇండ్ల మధ్యలోకి నీళ్లు వచ్చాయని వాపోయారు. పరిహారం రాకపోయినా, ఆర్అండ్ఆర్  సెంటర్ లో సౌలతులు లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఊరు విడిచి వెళ్లిపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.

తేలుకాటుతో యువకుడు మృతి

చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్లేశ్(20) తేలుకాటుతో చనిపోయాడు. బుధవారం ఉదయం వడ్డే బడే సాబు తన గుడిసెలో ఉన్న సామన్లను బయటికి 
తీసే క్రమంలో ఆయన కొడుకు మల్లేశ్​ను తేలు కాటు వేసింది. కొద్దిసేపటికే పరిస్థితి విషమించడంతో అయిజలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బీపీ పూర్తిగా పడిపోయిందని గద్వాలకు తీసుకెళ్లాలని సూచించారు.

గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇదిలాఉంటే అదే గ్రామంలో వరి నాట్లు వేస్తుండగా, వడ్డే గోవింద్ ను తేలు కాటు వేసింది. చికిత్స అనంతరం అతను కోలుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోకి చిన్నోనిపల్లి రిజర్వాయర్  నీళ్లు వస్తుండడంతో పాములు, తేళ్లు ఇండ్లల్లోకి వస్తున్నాయని గ్రామస్తులు 
వాపోయారు.