ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించండి

  • ఎమ్మెల్సీ యాదవరెడ్డిని కలిసిన నాయకులు 

గజ్వేల్​, వెలుగు: మల్లన్న సాగర్​ కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని ముంపు గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్వాసిత గ్రామాలను గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని, మున్సిపల్ లో విలీనం చేస్తే పన్నుల భారం ఎక్కువవుతుందన్నారు.

 అర్హత కలిగి ఇప్పటికీ ఆర్అండ్ఆర్​ప్యాకేజీ రాని వారికి వెంటనే ఇవ్వాలన్నారు. చాలామంది ఒంటరి మహిళలు, పురుషులకు ఎలాంటి పునరావాస ప్యాకేజీ రాలేదని వారిని ఆదుకోవాలన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో నాయకులు స్వామి, రాము, బాలకిషన్, కనకయ్య, మల్లేశం, రాజు, యాదగిరి పాల్గొన్నారు.