చంద్రుడిపై లేచి.. మళ్లీ దిగిన విక్రమ్

చంద్రుడిపై లేచి..  మళ్లీ దిగిన విక్రమ్
  • హాప్ టెస్టును విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో
  • 40 సెం.మీ. పైకి ఎగిరి 40 సెం.మీ. పక్కన దిగిన ల్యాండర్
  • పేలోడ్ లను స్విచ్ఛాఫ్ చేసి ల్యాండర్​ను స్లీప్ మోడ్​లోకి పంపిన సైంటిస్టులు
  • ఈ నెల 22 న మళ్లీ నిద్రలేస్తాయని ఆశాభావం వ్యక్తంచేసిన ఇస్రో

బెంగళూరు: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ మరోమారు విజయవంతంగా దిగింది.. ఇప్పటికే అక్కడ దిగిన ల్యాండర్​ను ఇస్రో సైంటిస్టులు పైకెగరవేసి కొద్దిగా పక్కకు జరిపి ల్యాండ్ చేశారు. చంద్రయాన్ –3 ప్రాజెక్టులో ఇది కూడా ఓ కీలక ప్రయోగమే. అయితే, దీని గురించి ఇస్రో ముందుగా వెల్లడించలేదు. ఇలా ల్యాండర్​ను పైకి ఎగరవేసి దింపడాన్ని హాప్ టెస్ట్ అంటారని, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు ఇదే కీలకమని సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలు సేకరించడం, మానవ సహిత ప్రయోగాలకు ఇదొక ప్రయోగాత్మక పరీక్షవంటిదని వివరించారు. ల్యాండర్ ను సేఫ్ గా దించడంతో పాటు మిషన్ పూర్తయ్యాక తిరిగి తీసుకురావడం సాధ్యమేనా కాదా అనేది ఈ పరీక్ష అసలు ఉద్దేశమని తెలిపారు. 

ఈ పరీక్షలో విక్రమ్ ల్యాండర్ విజయం సాధించిందని పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడి పైకి పంపించిన లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని సైంటిస్టులు తెలిపారు. దీంతోపాటు చంద్రుడిపై పగటి సమయం పూర్తవుతున్న క్రమంలో ల్యాండర్ ను కూడా స్లీప్ మోడ్ లోకి పంపించినట్లు ఇస్రో సైంటిస్టులు పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ రిసీవర్లు మినహా మిగతా పేలోడ్లను ఆఫ్​ చేసినట్లు వివరించారు. శనివారమే ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ల్యాండర్, రోవర్ లతో పాటు వాటిలోని పేలోడ్లు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. ఈ నెల 22 న చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం కానుందని, అప్పుడు విక్రమ్, ప్రజ్ఞాన్ నిద్రలేస్తాయని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెల 22న ఏం జరగనుంది..?

విక్రమ్ ల్యాండర్ దిగిన చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ప్రస్తుతం సాయంకాలం.. సూర్యుడు అస్తమించడంతో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ లలో నమోదవుతుంటాయి. గరిష్టంగా మైనస్ 200 వరకు టెంపరేచర్ నమోదు కావొచ్చని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ల్యాండర్, రోవర్ లలోని బ్యాటరీలు పూర్తిగా డ్రై అయ్యే ప్రమాదం ఉంది. ఈ నెల 22 న అక్కడ మళ్లీ సూర్యోదయం కానుంది. అప్పటికి ల్యాండర్, రోవర్ పాడవకుండా ఉంటే సౌర ఫలకల ద్వారా శక్తి పుంజుకుని మళ్లీ యాక్టివ్ అవుతాయని చెప్పారు. 

ఇప్పటికే మిషన్ ఆబ్జెక్ట్ లు పూర్తయిన క్రమంలో ల్యాండర్, రోవర్ నిద్రలేవక పోయినా వచ్చిన నష్టమేమీ లేదని వివరించారు. చంద్రుడిపై భారతదేశ అతిథులుగా అవి అలాగే ఉండిపోతాయని పేర్కొన్నారు. ఒకవేళ తిరిగి యాక్టివ్ గా మారితే మాత్రం చంద్రయాన్ –3 ప్రాజెక్టుకు బూస్టర్ లాంటిదని అన్నారు. ఈ నెల 22 తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ యాక్టివ్ గా మారితే వాటిని మరోచోటికి తరలించి ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాలనే మరోమారు నిర్వహిస్తామని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ రెండింటిలో శక్తి పూర్తిగా అడుగంటేదాకా ఇదే ప్రయోగాన్ని నిర్వహిస్తామని చెప్పింది. తాజాగా జరిపిన హోప్ టెస్ట్ కు సంబంధించిన వీడియోను కూడా ఇస్రో ట్వీట్ చేసింది.

హాప్ టెస్ట్ జరిగిందిలా..

శివశక్తి పాయింట్​లో దిగిన విక్రమ్ ల్యాండర్​ను ఇస్రో సైంటిస్టులు తిరిగి ఆన్ చేశారు. రాకెట్లు మండించడం ద్వారా ల్యాండర్​ను పైకి లేపి, కొద్దిగా పక్కకు జరిపి ల్యాండ్ చేశారు. ఉన్నచోటి నుంచి పైకెగిరి బ్యాలెన్స్ కోల్పోకుండా తన కాళ్లపై తను నిలబడడమే హాప్ టెస్ట్.. ఈ టెస్ట్​లో భాగంగా విక్రమ్ ల్యాండర్ 40 సెంటీమీటర్లు పైకి ఎగిరి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో మళ్లీ విజయవంతంగా ల్యాండ్ అయిందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు..