
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ నెల 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి మాట్లాడుతూ ‘పలాస, కళాపురం, పారాహుషార్ చిత్రాలతో పాటు ప్రదీప్ మద్దాలి గత చిత్రం ‘సర్వం శక్తిమయం’కు వర్క్ చేశాను. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పీరియాడిక్ సిరీస్ కావడంతో దీని కోసం చాలా రీసెర్చ్ చేశా. 1940లో హైదరాబాద్ ఎలా ఉండేది, అప్పటి ప్రజల వేషధారణ, సంస్కృతి తెలుసుకోవడం కోసం ‘మా భూమి’ లాంటి సినిమాలు చూడడంతో పాటు అందుకు సంబంధించిన ఆర్టికల్స్ చదివాను.
అవన్నీ దృష్టిలో ఉంచుకుని కథకు తగ్గట్టుగా కొన్ని లుక్ టెస్ట్‌లు చేసి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. ఫ్యాబ్రిక్స్ విషయంలో ముందుగా మేం అనుకున్నది వేరు.. కానీ స్టోరీకి తగ్గ మూడ్ ప్రకారం అవి మార్చాల్సి వచ్చింది. హీరో,హీరోయిన్స్ లుక్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. టెక్నీషియన్‌గా నాకిది డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. దీంతో పాటు ‘హరికథ’ అనే మరో పీరియాడిక్ వెబ్ సిరీస్‌కు వర్క్ చేశా. త్వరలో అది స్ట్రీమింగ్ కానుంది. ఇక సతీష్ వేగేశ్న గారు డీస్నీ హాట్ స్టార్ కోసం తీస్తున్న ‘మర్మయోగి’ సిరీస్‌కు వర్క్ చేస్తున్నా. అలాగే ‘మానసచోర’ అనే సినిమాకు పనిచేస్తున్నాను’ అని చెప్పింది.