వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో.. 15 మంది అరెస్ట్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ మరికొందర్ని ఇంకా పోలీసులు గుర్తిస్తున్నారు. ఫార్మావిలేజ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చి కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్లపై కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామస్థులు దాడికి దిగారు. ఈ చర్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈమేరకు మంగళవారం దాడికి పాల్పడ్డ15 మందిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరస్ పేట, దూద్యల్ మూడు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 

వికారాబాద్ జిల్లాలో ఘటనపై మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ సమీక్షిస్తున్నారు. లగచర్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అధికారులపై దాడి,- వాహనాల ధ్వంసం చేసినందుకు ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై దాడులకు నిరసనగా వికారాబాద్ జిల్లాలో ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించారు. గ్రామస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కొడంగల్ ప్రత్యేక అధికారి(కాడా) వెంకట్ రెడ్డికి నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.