బెజవాడలో మళ్లీ వర్షం .. భయాందోళనలో ప్రజలు

విజయవాడలో శనివారం ( సెప్టెంబర్​ 7)  ఉదయం నుంచి మళ్లీ వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, వన్‌ టౌన్‌, గవర్నర్‌ పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, పటమట, కృష్ణలంక, కానూరు తదితర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మళ్లీ వరద పెరుగుతుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశా హెచ్చరించింది. 

ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు.  అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు.  అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ .. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలన్నారు.  అవసరమైన మేరకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి .... ప్రజలు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు.  బుడమేరు గండ్లను  పూడ్చివేసినందున వరద ప్రభావిత ప్రాంతాల్లోకి .. కొత్తగా అక్కడి నుంచి వరదనీరు రావడం లేదు.  కానీ ప్రస్తుతం వర్షం బాగా కురుస్తున్నందువల్ల అధికారులు క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా శిబిరాలకు ప్రజలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.