గౌరవం లేని చోట పని చేయలేం.. కార్పొరేటర్​ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

విజయవాడ కార్పొరేటర్‌ పదవికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ( జనవరి 8)  విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన తండ్రి కేశినేని నానికి టీడీపీ జరిగిన అవమానం అందరికీ తెలిసిందేనని, ముగ్గురి స్వార్థం వల్ల తమ కార్పొరేటర్‌ అభ్యర్థులు నష్టపోయారని అన్నారు. వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆత్మగౌరవం లేని చోట పని చేయలేం అని ఆమె తెలిపారు.

ఎప్పుడూ టీడీపీని వీడాలనుకోలేదు

కార్పొరేటర్ పదవికి రాజీనామా అనంతరం కేశినేని శ్వేత (Kesineni Swetha)  పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 11వ డివిజన్ కార్పొరేటర్‌గా రాజీనామా చేశానని.. తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీ (TDP) పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు. టీడీపీ పార్టీ తమను వద్దు అనుకున్నప్పుడు పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. కేశినేని నాని (MP Kesineni Nani) పార్టీకి రాజీనామా చేసాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.

సంవత్సరం నుంచి పార్టీలో అవమానాలే..


గౌరవం లేని చోట పని చేయలేమని స్పష్టం చేశారు. గత సంవత్సరం కాలం నుంచి టీడీపీ పార్టీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. విజయవాడ చుట్టు పక్కన ఉన్న ఒక్క పార్లమెంట్‌లో కూడా అభ్యర్థి లేరన్నారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నామన్నారు.

లోకేష్​ ఇలా అన్నారు...

మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు ఇబ్బంది పెట్టారని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నామని.. తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తిరువూరు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ (Nara Lokesh) అడిగారని.. ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు కాక ఇంకెవరికి సంబంధమని ప్రశ్నించారు. కేశినేని నాని మూడవ సారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో భేటీ

రాజీనామా చేయడానికి బయలుదేరి వెళ్లడానికి ముందు కేశినేని శ్వేత.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. తాను రాజీనామా చేయబోతోన్నాననే విషయాన్ని, అందుకు గల కారణాలను వివరించారు. రాజీనామా చేయడానికి ముందు గద్దె రామ్మోహన్ ఆశీర్వాదాన్ని తీసుకున్నానని అన్నారు. మేయర్‌కు రాజీనామా పత్రాన్ని అందించిన వెంటనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.

 గద్దె రామ్మోహన్‌తో తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రాజకీయ గురువుగా భావిస్తానని శ్వేత అన్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన సహకారంతో తోటి కార్పొరేటర్లందరూ అభివృద్ధి చేశామని, అందుకే మర్యాదపూరకంగా కలిశానని వివరించారు. తన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేయగా ఆల్ ది బెస్ట్ చెప్పారని కేశినేని శ్వేత పేర్కొన్నారు.