ఎస్సై నారాయణమ్మ వేధింపులు.. డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

ఎస్సై నారాయణమ్మ వేధింపులు.. డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నాడు. పగలు చదువు కుంటూ రాత్రి తల్లి సాయంతో టీ కొట్టు నడుపుతున్నాడు. టీ అమ్మగా వచ్చిన డబ్బులతో అక్కా, చెల్లి పెళ్లి చేసి శెబాష్ అనిపించుకున్నాడు. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు.

పోలీసుల వేధింపులు తాళలేక విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన చిట్టూరి మురళి విజయవాడలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మురళీ తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నాడు. పగలు విద్యార్ధిగా, రాత్రి టీ కొట్టు నడుపుతూ కుటంబానికి పెద్దదిక్కయ్యాడు. టీకొట్టు నడుపుతూ అక్క ,చెల్లెలి పెళ్లి చేశాడు.

అందరికి సుపరిచితుడైన మురళీ..ఎస్సై నారాయణమ్మ వేధింపులు తాళలేక గన్నవరం కోనరాయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఎస్సై వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితులకు ఓ వాయిస్ మెసేజ్ పంపాడు. మురళి మృతిపై బంధువులు ఎస్సై నారాయణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం ఎప్పటిలాగా మురళీ కాలేజీ నుంచి గన్నవరానికి ద్వికచక్రవాహనంపై వెళుతుండగా మార్గం మధ్యలో..,ఎస్సై నారాయణమ్మ భర్త ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో నారాయణమ్మ స్టేషన్ కు పిలిపించి మురళిని తీవ్రంగా కొట్టిందని . మనస్థాపానికి గురైన మురళి గన్నవరంలోని కోనరాయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్సై పై వస్తున్న ఆరోపణలపై సీఐ స్పందించారు. మురళీని కొట్టాల్సిన అవసరం తమకు లేదని, రాత్రివేళ పెట్రోలింగ్ సమయాల్లో మురళీ టీకొట్లొ టీ తాగుతామని, అలాంటిది తామెలా కొడతామని అన్నారు. అయితే బాధితుడి ఆత్మహత్యపై ఉన్నతాధికారుల విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.