త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న సమయంలో… లిక్కర్ డాన్ విజయ్ మాల్యా సెటిల్మెంట్ ప్యాకేజీ ప్రకటించారు. తనపై ఈడీ కేసులన్నింటినీ పరిష్కరిస్తే బ్యాంకుల కన్సార్షియానికి రూ.13, 960 కోట్లు చెల్లిస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి విజయ్ మాల్యా తరపున ఆయన లాయర్ భారత సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని బెంచ్ ముందుకొచ్చిన ఈ పిటిషన్ లో సెటిల్మెంట్‌గా ఎంత చెల్లిస్తారనే విషయాన్ని చెప్పలేదని సుప్రీం కోర్ట్ వర్గాలు చెప్పాయి. అయితే జూన్‌లో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం… పూర్తి, తుది చెల్లింపుగా రూ.13,960 కోట్లు చెల్లిస్తానని విజయ్ మాల్యా తరపు న్యాయవాది తెలిపారు. రుణంగా మాల్యా తీసుకున్న మూలధనం రూ.9, 000 కోట్లు కాగా దానికంటే అధికం రూ.13,960 కోట్లు చెల్లిస్తానని మాల్యా ప్రకటించారు. బ్యాంకుల కన్సార్షి యంతో మాల్యా వివాదం పరిష్కారానికి ఇప్పటివరకు ప్రకటించిన అత్యధిక మొత్తం ఇదేనని ఈడీ వర్గాలు చెప్పాయి.
మాల్యా ఆఫర్‌పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. తరచూ ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ఆయనకు అలవాటేనన్నారు. మాల్యా మాటమీద కట్టుబడి ఉండదని ఆయన అన్నారు. మాల్యా పిటిషన్ దాఖలు చేయడాన్ని బట్టి చూస్తే ఆయనను త్వరలోనే భారత్‌కు అప్పగిస్తారని సంకేతాలు అందినట్టేనని తుషార్ మెహతా అంచనా వేశారు.

