స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌..నేటి నుంచి విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే వన్డే టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : టీమిండియా మరో ఎనిమిది వారాల్లో చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. ఈ ట్రోఫీ కోసం క్వాలిటీ లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెకండ్ వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోసం సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఈ  నేపథ్యంలో శనివారం నుంచి దేశ వ్యాప్తంగా మొదలయ్యే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌  ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టోర్నీలో సత్తా చాటి చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీకి ఎంపికవ్వాలని పలువురు ఆటగాళ్లు ఆశిస్తున్నారు. ఇండియా కోర్ టీమ్ బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో బరిలో నిలవగా... హార్దిక్ పాండ్యా (బరోడా), రింకూ సింగ్‌‌‌‌ (యూపీ), వరుణ్ చక్రవర్తి (తమిళనాడు) అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్ (పంజాబ్‌‌‌‌‌‌‌‌), అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్ (మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌), ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్ (రాజస్తాన్‌‌‌‌‌‌‌‌), ముకేశ్ (బెంగాల్‌‌‌‌‌‌‌‌) వంటి టీమిండియా స్టార్ ప్లేయర్లు తమ స్టేట్ టీమ్స్ తరఫున బరిలోకి దిగుతున్నారు.

చైనామన్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్ యాదవ్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో ఈ స్థానం కోసం వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ (గుజరాత్‌‌‌‌‌‌‌‌) రేసులో ఉన్నారు. మరోవైపు ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీగా ఉన్నాడా? లేదంటే లిస్ట్‌‌‌‌‌‌‌‌–ఎలో మంచి రికార్డున్న హైదరాబాదీ తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాలా? అనే అంశంపై సెలెక్టర్లు దృష్టి సారించారు. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో శనివారం నాగాలాండ్‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ తమ పోరు ఆరంభించనుండగా  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ తిలక్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ను సెలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

పేస్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఆశిస్తున్న అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్, ముకేశ్‌‌‌‌‌‌‌‌ వంటి వారికి కూడా విజయ్ హజారే కీలకం కానుంది. ముస్తాక్‌‌‌‌‌‌‌‌ అలీ టీ20 ట్రోఫీలో ఆడిన  మహ్మద్ షమీ.. బెంగాల్ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉంటున్నాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో త్రిపురతో జరిగే రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తను బరిలోకి దిగనున్నాడు.