హనోయ్: ప్రపంచంలో బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశంగా వియత్నాంకు పేరుంది. అలాంటి వియత్నాం పలు దశాబ్దాల తర్వాత ప్రధాన పోటీదారు అయిన భారత్ నుంచి రైస్‌ను దిగుమతి చేసుకోనుంది. వియత్నాంలో స్థానికంగా బియ్యం కొనుగోలు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశీయంగా ఉత్పత్తి తగ్గడంతో తొమ్మిదేళ్ల తర్వాత వియత్నాంలో ధాన్యం రేటు గరిష్టానికి చేరుకుంది. దీంతో భారత్ నుంచి రైస్ దిగుమతిపై వియత్నాం దృష్టి పెట్టింది. ఈ మేరకు 70 వేల టన్నుల ముడి బియ్యం కొనుగోలుకు భారత ట్రేడర్లతో డీల్ చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఒక్కో టన్నుకు 310 డాలర్లను ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రాతిపదికన ట్రేడర్లకు చెల్లిస్తారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వియత్నాం వంటి దేశం రైస్‌ను దిగుమతి చేసుకుంటోందంటే ఈ ఏడాది ఇండియాలోనూ బియ్యం ధరలు భారీగా పెరగొచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
