ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించటం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్య దీవెన పథకంలో భాగంగా అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి గాను అందాల్సిన డబ్బులను ప్రభుత్వం విదార్థుల అకౌంట్లలో జమ చేసింది. పామర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను నేడు జమ చేస్తున్నామని అన్నారు.
ఈ 57 నెలల కాలంలోనే మొత్తం రూ. 29లక్షల66వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తు రూ. 12,610 కోట్ల తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, పేదపిల్లలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకున్నారని అందుకే తెలుగు అంతరించిపోతుందని నానా యాగీ చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. పేదల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలని అంటున్న వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని అన్నారు. పేదలకు ఒక న్యాయం, పెత్తందారులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చినందుకే చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే చూసి ఓర్వలేని చంద్రబాబు పిల్లలు చెడిపోతున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు.